- ఒక్కొక్కటి 500 గజాల స్థలంలో రూ.30 లక్షలతో నిర్మాణం
- పంట ఉత్పత్తులు నిల్వ చేసుకునే వెసులుబాటు
- రైతుల నుంచి నామమాత్రపు అద్దెతో మహిళా సంఘాలకు ఆదాయం
- స్థల సేకరణలో నిమగ్నమైన డీఆర్డీవోలు
హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలో మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం మరో అడుగు వేసింది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసుకునేలా గోదాంలు నిర్మించేందుకు నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ(సెర్ప్) ఆధ్వర్యంలో ఉపాధిహామీ పథకం నిధులతో తొలి విడతలో 162 మినీ గోదాంలను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. వీటి నిర్మాణ బాధ్యతలతోపాటు నిర్వహణను మహిళా సంఘాలకే అప్పగించనుంది. రైతులు తమ పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర రానప్పుడు దళారులకు అమ్ముకొని నష్టపోకుండా నిల్వ చేసుకునేలా వీటి నిర్మాణం ఉండనుంది.
గోదాంలు లేక ఇబ్బందులు
గ్రామాల్లో పంటను నిల్వ చేసుకునేందుకు గోదాంలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. పంట ఉత్పత్తులను ఇంట్లో నిల్ల చేద్దామంటే సరిపడా స్థలం లేక, వర్షాలు కురుస్తాయని భయపడి దళారులు చెప్పిన ధరకే విక్రయించి ఆర్థికంగా చితికిపోతున్నారు. ఇకమీదట ఈ పరిస్థితి ఉండొద్దన్న ఉద్దేశంతో రాష్ట్ర సర్కారు వారి పంట ఉత్పత్తులకు రక్షణ కవచంగా నిలిచేందుకు గోదాంల నిర్మాణానికి ముందుకొచ్చింది. ఒక్కో గోదాంను 500 గజాల స్థలంలో సుమారు రూ.30 లక్షలతో నిర్మించనుంది. పనులు పూర్తయ్యాక వీటిని స్వయం సహాయక సంఘాలకు (ఎస్‌హెచ్‌జీ) అప్పగించనుంది. గోదాంలను రైతులకు నామమాత్రపు అద్దెకు ఇవ్వడం ద్వారా సంఘాలకు ఆదాయం సమకూరనుంది. రైతులు తమ ధాన్యాన్ని సురక్షితంగా నిల్వ చేసుకోవడంతోపాటు ధరలు పెరిగినప్పుడు అమ్ముకోవచ్చు. ఈ గోదాంల నిర్మాణం, నిర్వహణను సెర్ప్ పర్యవేక్షించనుంది. దీనిపై మహిళా సంఘాలకు, సమాఖ్యలకు శిక్షణ ఇవ్వనుంది.
స్థల పరిశీలనలో అధికారులు
గోదాంల నిర్మాణానికి అవసరమైన స్థలాలను గుర్తించాలని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ప్రధానంగా మండల కేంద్రాలు, వ్యవసాయ ఉత్పత్తులు ఎక్కువగా వచ్చే పెద్ద గ్రామ పంచాయతీలను ఎంపిక చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉన్నచోట వెంటనే ప్రతిపాదనలు పంపాలని సూచించింది.
ప్రస్తుతం జిల్లాల వారీగా డీఆర్డీవోలు రెవెన్యూ అధికారులతో కలిసి స్థల పరిశీలనలో నిమగ్నమయ్యారు. రోడ్డు రవాణా సౌకర్యం ఉండి, రైతులకు అందుబాటులో ఉండే 500 గజాల స్థలాల కోసం వెతుకుతున్నారు. కొన్ని జిల్లాల్లో ప్రభుత్వ భూములు కబ్జాల్లో ఉండటం, గ్రామాలకు దూరంగా ఉండటం సవాల్‌గా మారింది.
వచ్చే వానాకాలం సీజన్ నాటికి కనీసం సగం గోదాంలనైనా అందుబాటులోకి తేవాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి, శంకుస్థాపనలు చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. మహిళా శక్తి పథకం కింద ఇప్పటికే క్యాంటీన్లు, ఇతర యూనిట్లు మంజూరు చేస్తున్న ప్రభుత్వం.. ఇప్పుడు గోదాంల నిర్వహణను కూడా మహిళలకే ఇవ్వడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో వారిని భాగస్వాములను చేస్తోంది.
